ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డులలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కి ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. జవాన్ సినిమాకి గాను షారుఖ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు. అయితే షారుఖ్ కి ఈ అవార్డు రావడంపై అనేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు షారుఖ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతుంటే.. మరోవైపు కొంతమంది సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఈ అవార్డు షారుఖ్ కి రావాల్సింది కాదని.. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ నటనకు ఈ అవార్డు దక్కాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించాడు నటుడు మనోజ్ బాజ్ పాయ్. షారుఖ్ ఖాన్ కంటే తనకు జాతీయ అవార్డు వస్తే సంతోషించే వాళ్లం అని ఫ్యాన్స్ అనడంపై మనోజ్ స్పందిస్తూ.. ఇది ఒక అనవసరమైన చర్చగా.. చెత్త సంభాషణగా అభివర్ణించారు. నేషనల్ అవార్డు విషయం ఇప్పటికే జరిగిపోయిందని దానిని మరిచిపోవడం మంచిదని అన్నారు. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’, ‘జోరామ్’ సినిమాలు తన కెరీర్ లో అత్యంత ముఖ్యమైనవి అని కానీ అవార్డు రాకపోతే భాదపడేవాడిని కాదని మనోజ్ తెలిపాడు.
అంతేగాకుండా నేషనల్ అవార్డుల గురించి మనోజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జాతీయ అవార్డులతో సహా అనేక అవార్డులు వాటి ప్రాధాన్యతను కోల్పోతున్నాయని తెలిపాడు. ప్రస్తుతం అవార్డులు కళాత్మక విలువకు బదులుగా వాణిజ్యపరమైన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని మనోజ్ విమర్శించారు. ఒక నటుడిగా తనకు ఉన్న గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని అవార్డులు అనేవి కేవలం ఇంటి బీరువాలో అలంకరించే వస్తువులు మాత్రమేనని వాటిని తాను అంత సీరియస్ గా తీసుకోనని తెలిపారు.
