తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తన మనవరాలి కోరిక మేరకు మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ నయనతారను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఐరా ఆశీష్ ఇటీవల భారత్‌కు వచ్చారు. ఆమె చిరంజీవిని కలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయగా రామచందర్ రావు కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవిని షూటింగ్ స్పాట్‌లో కలిశారు. ఈ కలయికకి సంబంధించిన ఫొటోలని రామచందర్ రావు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. సమావేశంలో సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి తమకు ఎంతో ఆప్యాయతతో సమయం కేటాయించారని రామచందర్ రావు తెలిపారు. ఈ కలయిక తమ కుటుంబానికి మరపురాని ఆనందాన్నిచ్చిందని స్పష్టం చేశారు.
