తానా 24వ మ‌హాస‌భ‌లు.. ప్ర‌త్యేక అతిథులకు పిలుపు..

తానా 24వ మ‌హాస‌భ‌లు.. ప్ర‌త్యేక అతిథులకు పిలుపు..

 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహించే ప్రతిష్ఠాత్మక ద్వైవార్షిక మహాసభలు ఈసారి డెట్రాయిట్ నగరంలో జరగనున్నాయి. జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్‌ సబర్బ్ నోవైలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ వేదికగా 24వ తానా మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభల ఏర్పాట్లు పూర్తయ్యాయని, అతిథులు ఇప్పటికే రావడం ప్రారంభించినట్లు తానా కన్వీనర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనను విడుదల చేస్తూ, ఈ మహాసభలు తెలుగు సంస్కృతి, సాహిత్యం, సంగీతం, చలనచిత్రం తదితర రంగాల్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నాయని పేర్కొన్నారు. ఈసారి తానా మ్యూజిక్ ఈవెంట్‌లో ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, గాన కోకిల చిత్ర ప్రత్యేక సంగీత విభావరిని నిర్వ‌హించ‌నున్నారు. అలాగే, గాయని సునీత, గాయకుడు ఎస్పీబీ చరణ్ సహా అనేక నేపథ్య గాయకులు లైవ్ మ్యూజిక్ షోలతో వేడుకను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నారు. ప్రముఖ హీరోయిన్ సమంత తొలిసారిగా తానా మహాసభలకు హాజరుకానున్నారని, ఇది తెలుగు కమ్యూనిటీకి ఎంతో విశిష్టమైన సందర్భంగా నిలుస్తుందని ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. అంతేకాదు, ఐశ్వర్య రాజేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. వీరితో కలిసి అభిమానులు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. తెలుగు భక్తి సంగీతానికి పునాది వేసిన అన్నమాచార్య కీర్తనలతో శోభారాజు “స్వరార్చన” అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది భక్తి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం. ఆతిథ్య ఏర్పాట్లు కూడా అత్యుత్తమంగా చేసినట్టు చెప్పారు. తెలుగు సంస్కృతి, కళల విలువలు విశ్వవ్యాప్తంగా చాటే ఈ వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి అని ఉదయ్ కుమార్ చాపలమడుగు పిలుపునిచ్చారు.

editor

Related Articles