దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకుంటూ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన కరుప్పు సినిమా విజయంతో ఆమె మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. త్వరలో తెలుగులో చిరంజీవికి జోడీగా నటించిన విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మిస్ చెన్నై కిరీటం గెలిచిన తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టానని, ఆ సమయంలో చాలామంది సినిమాల్లోకి వస్తారా అని అడిగేవారని తెలిపారు. అయితే అప్పట్లో తాను సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని, ఎప్పటికీ సినీ రంగంలోకి రానని గట్టిగా చెప్పేదానినని గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో సినిమా గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో అలా స్పందించానని త్రిష చెప్పారు. కానీ కాలక్రమంలో పరిస్థితులు మారి సినీ రంగంలోకి అడుగుపెట్టానని, అదే తన జీవితంలో కీలక మలుపుగా మారిందని పేర్కొన్నారు. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె నిజంగానే అప్పటి నిర్ణయానికే కట్టుబడి ఉండి ఉంటే భారతీయ సినీ పరిశ్రమ ఒక ప్రతిభావంతమైన హీరోయిన్‌ను కోల్పోయేదని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

