దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన హాలీవుడ్ సినిమా ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ.2,548 కోట్లు) గ్రాస్ వసూళ్లు సాధించి నోలన్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్గా నిలిచింది. మాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజే భారత్‌లో రూ.20.76 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సుమారు 39.8 మిలియన్ డాలర్లు రాబట్టిన ఈ సినిమా, వీకెండ్ ముగిసే నాటికి 264 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ఇందులో ఉత్తర అమెరికా నుంచే 124 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఈ కలెక్షన్లతో నోలన్ గత సినిమాలైన ‘ది డార్క్ నైట్ రైజెస్’, ‘ఒప్పెన్‌హైమర్’ తొలి వీకెండ్ రికార్డులను కూడా ‘ది ఒడిస్సీ’ అధిగమించింది. హోమర్ రచించిన ప్రసిద్ధ గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ సినిమాని సుమారు రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కేవలం 91 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగుతుండటంతో త్వరలోనే వన్ బిలియన్ డాలర్ల క్లబ్లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

