‘కేజీఎఫ్’ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’పై మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. చిత్రబృందం త్వరలోనే రెండో పాటను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీ స్వరపరిచిన ఈ పాటను సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. ఈ సాంగ్‌లో యశ్ సరసన బాలీవుడ్ నటి తారా సుతారియా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యశ్ సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సినిమాలో రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిత్ తివారీ, సురజిత్ గోపినాథ్‌తో పాటు పలువురు అంతర్జాతీయ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఆధ్వర్యంలోని బృందం ఈ సినిమాకి సంగీతం అందిస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ‘టాక్సిక్’ సినిమాని ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

