విడుదలకు ముందే ప్రచారం మూలంగా ఈ సినిమాపై మంచిగా అంచనాలు పెరిగాయి. ‘జాతిరత్నాలు’ స్థాయిలో నవ్విస్తారనే నమ్మకం జనాలకు కుదిరింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? చూద్దామా.. అని ఆడియన్స్ కూడా బాగానే ఎదురు చూశారు. పైగా నవ్వించడానికే అన్నట్టు సినిమా అంతా హాస్యనటులతో నింపేయడంతో కాస్త నవ్వుకోవడానికి ‘మిత్రమండలి’ కరెక్ట్ అని అంతా ఫిక్సయిపోయారు. ఇన్‌స్టా వీడియోల ద్వారా పాపులర్ అయిన నిహారిక ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిచయం అవుతుండటం కూడా ఓ విధమైన ఆసక్తికి కారణం అయ్యింది. మొత్తంగా గురువారం ‘మిత్రమండలి’ సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి అందరి అంచనాలనూ నిజం చేశారా? లేదా? తెలుసుకునేముందు.. ముందు కథాపరంగా ఎలా ఉందో చూద్దాం..
నారాయణ ఆ ఊరి పెద్దమనిషి (వీటీ గణేశ్). తనకు అణువణువునా కులగజ్జే. కులాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే అవుదామనుకుంటాడు. ఇంతలో అతనికి అనుకోని షాక్ ఎదురవుతుంది. తన కూతురు స్వేచ్ఛ (నిహారిక) వేరెవర్నో ప్రేమించి, ఇంట్లో నుండి చెప్పకుండా జంప్ అవుతుంది. ఈ విషయం బయటకు పొక్కితే తన కులం తనను వెలి వేస్తుందనే భయంతో ఆ ఊరి ఎస్‌ఐ సాగర్ (వెన్నెల కిషోర్)ని కలిసి సీక్రెట్‌గా తన కూతుర్ని వెతకమని ప్రాధేయపడతాడు. తన కూతుర్ని ఎలాగైనా తీసుకొచ్చి తన పరువు కాపాడమని వేడుకుంటాడు. ఇంతలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ఎంటరవుతాడు.
