టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు, బికినీ పాత్రలపై తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు. ప్రస్తుతం ‘ది ఇండియా స్టోరీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెరీర్ ప్రారంభం నుంచే అలాంటి పాత్రలకు దూరంగా ఉన్నానని, వ్యక్తిగతంగా అసౌకర్యంగా అనిపించడం వల్ల కొన్ని పెద్ద అవకాశాలను కూడా వదులుకున్నానని తెలిపారు. “సినిమాల కోసం లేదా డబ్బు కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. వాటిపై రాజీ పడను” అని కాజల్ స్పష్టం చేశారు.
తల్లి అయిన తర్వాత పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని, భవిష్యత్తులో తన కుమారుడు నీల్ తన సినిమాలు చూసి గర్వపడాలని కోరుకుంటున్నానని చెప్పారు. అతనికి అసౌకర్యంగా అనిపించే పాత్రలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు. ఇటీవల పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్, బోల్డ్ పాత్రలు చేయడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో కాజల్ వ్యాఖ్యలు మళ్లీ వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమె అభిప్రాయాలపై భిన్నంగా స్పందిస్తున్నారు.
కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ జులై 24న విడుదల కానుండగా, తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK111 సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు.

