తెలంగాణ భాష గొప్పదన్న గరికపాటి

తెలంగాణ భాష గొప్పదన్న గరికపాటి

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పేరు అర్థం కాలేదంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేయగా, మరికొందరు ఇది తెలంగాణ భాషా ప్రత్యేకతను ప్రతిబింబించే పదమని మద్దతు తెలిపారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మాండలికాలపై సోషల్ మీడియాలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గతంలో తెలంగాణ భాష గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తెలంగాణ మాండలికం గ్రాంథిక తెలుగుకు అత్యంత దగ్గరగా ఉంటుందని, అక్కడ వాడే అనేక పదాలకు శాస్త్రీయమైన ఆధారం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘చేసిన్రు’ వంటి పదాలు కూడా వ్యాకరణపరంగా సముచితమైనవేనని, తెలంగాణ భాషలో పాత తెలుగు పదాలు ఇప్పటికీ సజీవంగా ఉండటానికి ఆంగ్ల ప్రభావం తక్కువగా ఉండటమే కారణమని వివరించారు.

భాషాభిమానులు కూడా తెలంగాణ మాండలికాన్ని కించపరచడం సరికాదని, ప్రతి ప్రాంత భాష తెలుగు సంపదలో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. భాషా పరిశోధకుల ప్రకారం, ‘ఇడుపు కాయితం’ అనేది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా వాడుకలో ఉన్న పదం. భార్యాభర్తలు కలిసి జీవించలేమని నిర్ణయించుకున్నప్పుడు గ్రామ పెద్దల సమక్షంలో రాసుకునే విడిపోతున్న ఒప్పంద పత్రాన్ని ఈ పేరుతో పిలిచేవారని చెబుతున్నారు. అందువల్ల ఇది కేవలం సినిమా టైటిల్ మాత్రమే కాకుండా, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే పదమని పేర్కొంటున్నారు. తెలుగు భాషలోని అన్ని మాండలికాలను గౌరవించి వాటి ప్రత్యేకతను గుర్తించాలని పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సూచిస్తున్నారు.

Related Articles