ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని డైరెక్ష‌న్ చేయాల‌ని ఉందన్న ధనుష్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని డైరెక్ష‌న్ చేయాల‌ని ఉందన్న ధనుష్‌

టాలీవుడ్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయాల‌ని చాలామంది టెక్నీషియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న సినిమాల సంఖ్య త‌గ్గించే అవ‌కాశం ఉంది. గ‌తంలో ఆయ‌న క‌మిటైన మూడు సినిమాల‌ని ప్ర‌స్తుతం పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు ప‌వ‌న్. ఇటీవ‌లే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా చేస్తున్నాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని డైరెక్ట్ చేయాల‌నే కోరిక త‌న‌కి ఉంద‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తమిళ స్టార్ హీరో ధనుష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. తెలుగులో నాకు డైరెక్షన్ చేసే అవకాశం వస్తే, పవన్ కళ్యాణ్ సార్‌ను డైరెక్ట్ చేయాలనుంది అని ధనుష్ చెప్పగానే, ఆడిటోరియం మొత్తం ఉర్రూతలూగింది. అభిమానులు ఈలలు, కేకలతో జోరుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పట్ల తన అభిమానాన్ని ధనుష్ ఇప్పటికే ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. గతంలోనూ “తెలుగులో నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్” అని చెప్పిన ధనుష్, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఆయ‌న‌ని నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్పడం అభిమానుల్లో ఆనందం నింపింది. గ‌త రాత్రి జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాంకర్ సుమతో ధనుష్ చేసిన సరదా సంభాషణ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఒకటో తారీఖు కష్టాలు మీకూ ఉంటాయా అని సుమ ప్రశ్నించింది. ధనుష్ బదులిస్తూ నాకు ఎందుకు ఉండ‌వు, ప‌క్కాగా ఉంటాయి. మీరు రూ.150 సంపాదిస్తే 200 సమస్యలు ఉంటాయి. నేను కోటి సంపాదిస్తే 2 కోట్ల సమస్యలు ఉంటాయి అని ధనుష్ తెలిపారు.

editor

Related Articles