బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తొలిసారిగా వెల్లడించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, ‘మిమి’ సినిమా షూటింగ్ సమయంలోనే తన అండాలను (ఎగ్స్) ఫ్రీజ్ చేయించుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు.
‘మిమి’ సినిమాలో పాత్ర కోసం బరువు పెరగాల్సి రావడంతో ప్రత్యేక ఆహారం తీసుకున్నానని, ఆ సమయంలో శరీరంలో అనేక మార్పులు వచ్చాయని కృతి తెలిపారు. అప్పుడే షూటింగ్‌లో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన సలహాతో ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచించానని చెప్పారు. “ఇది నీకు నువ్వు ఇచ్చుకునే అత్యుత్తమ బహుమతి అవుతుంది” అన్న మాట తనపై బలమైన ప్రభావం చూపిందని, అప్పటికే శారీరకంగా మార్పులు జరుగుతున్నందున అదే సరైన సమయంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.
‘మిమి’ సినిమాలో సరోగసీకి అంగీకరించే యువతి పాత్రలో నటించిన కృతి, ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. ఆమె నటనకు విశేష ప్రశంసలు లభించగా, అదే సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు.
కృతి తన వ్యక్తిగత నిర్ణయాన్ని బహిరంగంగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల ఆరోగ్యం, భవిష్యత్ కుటుంబ ప్రణాళికలపై అవగాహన పెంచేలా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

