‘దూధియా బదన్’పై మళ్లీ స్పందించిన అన్నూ

‘దూధియా బదన్’పై మళ్లీ స్పందించిన అన్నూ

బాలీవుడ్‌లో నటి తమన్నా భాటియాపై సీనియర్ నటుడు అన్నూ కపూర్ చేసిన ‘దూధియా బదన్’ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గతంలో చేసిన ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.

నెటిజన్ల ట్రోలింగ్‌పై స్పందించిన అన్నూ కపూర్, ఇంగ్లీషులో అదే భావాన్ని వ్యక్తపరిస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరని, కానీ హిందీలో మాట్లాడితే మాత్రం వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. ‘మిల్కీ బాడీ’ అని చెప్పడం సహజంగా భావిస్తారని, అదే హిందీలో ‘దూధియా బదన్’ అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

భారత్‌కు రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మానసికంగా ఇంకా బ్రిటీష్ ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. భాష ఆధారంగా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు.

అయితే, తన వ్యాఖ్యల వల్ల తమన్నా భాటియా మనస్తాపానికి గురై ఉంటే ఆమెకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నూ కపూర్ స్పష్టం చేశారు.

గతంలో తమన్నా నటించిన ‘ఆజ్ కీ రాత్’ పాట గురించి మాట్లాడుతూ ‘వావ్… దూధియా బదన్’ అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. తాజాగా ఆయన చేసిన వివరణతో ఈ అంశం మరోసారి వార్తల్లో నిలిచింది.

Related Articles