బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమయ్యారు. శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా ఆమె ఓ శివాలయాన్ని సందర్శించి శివలింగానికి జలాభిషేకం చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అయితే పూజల సమయంలో కూడా సన్‌గ్లాసెస్ ధరించడం నెటిజన్ల విమర్శలకు దారితీసింది. వీడియోలో భూమి బ్లాక్ టాప్, బ్లూ జీన్స్‌తో పాటు బ్లాక్ సన్‌గ్లాసెస్ ధరించి శివలింగానికి అభిషేకం చేసి నమస్కరిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆమె, “జీవితం సులభంగా మారాలని కాదు.. ఎలాంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను. హర్ హర్ మహాదేవ్” అంటూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు దేవాలయంలోకి వెళ్లేటప్పుడు కనీసం సన్‌గ్లాసెస్ తొలగించాల్సిందని అభిప్రాయపడ్డారు. “దేవుడి ముందు భక్తి ముఖ్యమా.. స్టైల్ ముఖ్యమా?”, “గుడిలో కూడా సన్‌గ్లాసెస్‌తో పూజలు చేయడం సరైంది కాదు” అంటూ విమర్శలు చేశారు.
మరోవైపు కొందరు మాత్రం భూమికి మద్దతుగా నిలిచారు. వ్యక్తి దుస్తులు లేదా రూపాన్ని చూసి భక్తిని అంచనా వేయడం సరికాదని, ఆమె ఉద్దేశం భక్తితో ప్రార్థించడం మాత్రమే అయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై భూమి పెడ్నేకర్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

