జవాన్ వెనుక మేల్కొని ఉన్న ఒక తల్లి ఆవేదన ఉంటుంది.. అలియా భట్

జవాన్ వెనుక మేల్కొని ఉన్న ఒక తల్లి ఆవేదన ఉంటుంది.. అలియా భట్

భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు స‌ద్దుమ‌ణిగిన నేప‌థ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ ఇండియ‌న్ ఆర్మీని ఉద్దేశించి ప్ర‌త్యేక పోస్ట్ పెట్టారు. అలియా రాసుకొస్తూ.. గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది,  ప్రతి వార్త వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం కనిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైనికులు మేల్కొని, దేశం కోసం మ‌న‌కోసం యుద్ధం చేస్తున్నార‌నే  బరువును మనం అనుభవించాం అంటూ అలియా అన్నారు. మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డ‌ర్‌లో ఉన్న ప్ర‌జ‌లు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని త‌న త‌ల్లికి తెలుస్తుందని తెలిపింది. ఇటీవ‌లే జ‌రిగిన‌ మాతృ దినోత్సవం గురించి అలియా స్పందిస్తూ.. పూలు పంచుకుంటూ, ఆప్యాయంగా పలుకరించుకుంటున్న వేళ, దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులను కని పెంచిన తల్లుల గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను. ప్రాణాలు కోల్పోయిన వారిని, ఇక ఎన్నటికీ ఇంటికి రాని సైనికులను, ఇప్పుడు ఈ దేశ హృదయంలో శాశ్వతంగా చెక్కిన వారి పేర్లను మనం తలుచుకుని దుఃఖిస్తున్నాము. వారి కుటుంబాలకు దేశం కృతజ్ఞతలో శక్తి లభించాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు.

editor

Related Articles