వీరమల్లుకు ధీటుగా ఔరంగజేబు

వీరమల్లుకు ధీటుగా ఔరంగజేబు

పవన్‌కళ్యాణ్‌ హీరోగా ‘హరిహర వీరమల్లు’ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకరరావు భారీబడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ నెల 3న సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ జరుగనున్నది. ఇది పవన్‌కళ్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా సినిమా. చరిత్రలో ఉన్న పాత్రలను తీసుకుని జానపద ధోరణిలో తీసిన కాల్పనిక కథాంశమిది. ‘యానిమల్‌’లో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్‌.. ఈ సినిమాలో మొఘల్‌ సామ్రాజ్యాధినేత ఔరంగజేబుగా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభంలో దర్శకుడు క్రిష్‌.. బాబీడియోల్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ ‘యానిమల్‌’లో బాబీడియోల్‌ నటనను చూసిన తర్వాత దర్శకుడు జ్యోతికృష్ణ.. ‘హరిహర వీరమల్లు’లో ఆయన పాత్రను రీక్రియేట్‌ చేయాలని నిర్ణయించారు. బాబీడియోల్‌ పోషించిన ఔరంగజేబు పాత్రను కొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారు. ఈ సందర్భంగా జ్యోతికృష్ణ మాట్లాడుతూ యానిమల్‌లో ఒక్క డైలాగ్‌ లేకుండా బాబీడియోల్‌ వ్యక్తపరిచిన హావభావాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయన ఇందులో పోషించిన ఔరంగజేబు పాత్రను మరింత శ్రద్ధతో తీర్చిదిద్దాను. ఇందులో ఆయన అత్యంత శక్తివంతంగా కనిపిస్తారని తెలిపారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ్‌ఖేర్‌, సత్యరాజ్‌, జిషు సేన్‌గుప్త, నాజర్‌, సునీల్‌, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ఇతర పాత్రధారులు. ఈ సినిమాకి సంగీతం: ఎం.ఎం.కీరవాణి.

editor

Related Articles