అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంతో మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా, మొదట మే 1న విడుదల చేయాలని భావించారు. అనంతరం జూన్‌కు మార్చినట్టు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమవుతూ జూలై లేదా ఆగస్ట్‌కు వెళ్లే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అంటే మరో నెల నుంచి నెలన్నర వరకు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికీ అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వాయిదా వార్తలు అభిమానుల్లో నిరాశ కలిగిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.

