ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏఐ కారణంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల పాత్ర గణనీయంగా తగ్గిపోతుందని ఆయన ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పాలనా వ్యవస్థ మొత్తం రాజకీయ నాయకులు, అధికారులు, వారి నిర్ణయాలపై ఆధారపడుతోందని, అయితే మనుషులపై భయం, ఒత్తిడి, స్వార్థం, లంచాల ప్రభావం ఉండటం వల్ల వ్యవస్థలో అవినీతి పెరుగుతోందని వర్మ అన్నారు. అదే పనులను ఏఐ నిర్వహిస్తే బదిలీ భయం, రాజకీయ ఒత్తిడి, లంచాలు వంటి అంశాలకు అవకాశం ఉండదని పేర్కొన్నారు.
దుబాయ్‌లో ఇప్పటికే మనుషుల ప్రమేయం లేకుండా పనిచేసే స్మార్ట్ పోలీస్ స్టేషన్లు అందుకు ఉదాహరణ అని చెప్పారు. అక్కడ ఆటోమేటిక్‌గా ఎఫ్ఐఆర్లు నమోదు అవుతూ, అవినీతికి తావు లేకుండా వ్యవస్థ నడుస్తోందని గుర్తు చేశారు.
వ్యవసాయం వంటి అంశాల్లో కూడా ఏఐ శాటిలైట్ చిత్రాలు, నేల స్వభావం, వర్షపాతం, మార్కెట్ పరిస్థితులు, గత డేటాను క్షణాల్లో విశ్లేషించి అత్యుత్తమ నిర్ణయాలు తీసుకోగలదని వర్మ అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు, బంధుప్రీతి లేదా ఎన్నికల లెక్కలు ఏఐపై ప్రభావం చూపవని తెలిపారు.
ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం ప్రజలు– ప్రభుత్వం మధ్య వారధిగా ఉన్నప్పటికీ, ఏఐ పారదర్శకంగా, వేగంగా, అవినీతి రహితంగా పాలన అందిస్తే మధ్యవర్తుల అవసరం తగ్గిపోతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు క్రమంగా అల్గారిథమ్‌ల ఆధారంగా నడిచే రోజులు వస్తాయని, మనుషుల కంటే ఏఐ ప్రజలకు ఎక్కువ మేలు చేసే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

