హాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘స్పైడర్- మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది. విడుదలైన తొలి రోజే రూ.61 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసి, ఇండియాలో అత్యధిక ఫస్ట్ డే వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ పేరిట ఉన్న రూ.53.10 కోట్ల తొలి రోజు రికార్డును ఈ సినిమా అధిగమించింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 5,000 కుపైగా స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా, ఇండియాలో అత్యంత భారీ స్థాయిలో విడుదలైన హాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే స్పైడర్ -మ్యాన్ ఫ్రాంచైజీలోనూ ఇదే అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేసిన చిత్రాల్లో కూడా ఇండియాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
తొలి రోజు నుండే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో, లాంగ్ వీకెండ్ ముగిసే నాటికి ఈ సినిమా భారతదేశంలో రూ.200 కోట్లకు చేరువయ్యే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

