లారా దత్తా కాస్ట్యూమ్‌పై నెటిజన్ల విమర్శలు

లారా దత్తా కాస్ట్యూమ్‌పై నెటిజన్ల విమర్శలు

దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక సినిమా ‘రామాయణం’ ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో కైకేయి పాత్రలో నటిస్తున్న లారా దత్తా ఫస్ట్ లుక్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లారా దత్తా ధరించిన కాస్ట్యూమ్, హెయిర్‌స్టైల్ త్రేతాయుగ నేపథ్యానికి సరిపోలడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. ఆధునిక శైలిలో రూపొందించిన డిజైనర్ బ్లౌజ్, స్ట్రైట్ హెయిర్ లుక్ కారణంగా పాత్రలో సహజత్వం కనిపించడం లేదని కామెంట్లు చేస్తున్నారు. పౌరాణిక కథకు తగిన దుస్తులు, రూపకల్పన ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

మరికొందరు అయితే ఈ లుక్‌ను ప్రముఖ టీవీ సీరియళ్లలో కనిపించే శైలితో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, సినిమా అనేది దర్శకుడి సృజనాత్మక దృష్టికోణానికి ప్రతిబింబమని, కేవలం ట్రైలర్ ఆధారంగా తుది నిర్ణయానికి రావడం సరైంది కాదని కొందరు మద్దతుగా వ్యాఖ్యానిస్తున్నారు.

మహర్షి వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, రవి దూబే, అరుణ్ గోవిల్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2026 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles