రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’ నుంచి మరో భారీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8న బెంగళూరులో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ముందు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ప్రత్యేక మీడియా సమావేశంలో సినిమా విశేషాలను వెల్లడించనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు యశ్‌తో పాటు సినిమాలోని ఐదుగురు హీరోయిన్లు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి చిత్రీకరించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా భాషల్లో డబ్ చేసి ఆగస్టు 26న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు మంచి స్పందన అందుకోగా, ట్రైలర్‌తో అంచనాలు మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇక ఈ సినిమా బలమైన భావోద్వేగాలతో కూడిన కథ అని యశ్ తెలిపారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ జేజే పెర్రీ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. ఈ సినిమాలో తారా సుతారియా, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

