‘పెళ్లిచూపులు’.. విజయ్‌కు టర్నింగ్ పాయింట్

‘పెళ్లిచూపులు’.. విజయ్‌కు టర్నింగ్ పాయింట్

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘పెళ్లిచూపులు’ నేటికి (జులై 29) పదేళ్లు పూర్తయ్యాయి. 2016లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ ప్రధాన పాత్రలు పోషించగా, తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమాని డి. సురేశ్ బాబు సమర్పించారు. సహజమైన కథ, వినోదభరితమైన సంభాషణలు, కొత్త తరహా కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సోలో హీరోగా విజయ్ దేవరకొండకు ఇది తొలి పెద్ద హిట్‌గా నిలిచి, అనంతరం అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగే అవకాశాన్ని కల్పించింది. రీతూ వర్మకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి సినిమాతోనే తన ప్రత్యేక ముద్ర వేశారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ఈ సినిమా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు అందుకోగా, ఉత్తమ మాటల రచయితగా తరుణ్ భాస్కర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర సినీ పురస్కారాల్లో కూడా ఈ సినిమాకి ప్రత్యేక గుర్తింపు లభించింది. పదేళ్లు పూర్తయినా ‘పెళ్లిచూపులు’ తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాగా కొనసాగుతోంది.

Related Articles