‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తమిళ చిత్రమే

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తమిళ చిత్రమే

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై దర్శకుడు కీలక స్పష్టత ఇచ్చారు. ఆగస్టు 14, 2026న విడుదల కానున్న ఈ సినిమాని చాలామంది తమిళ- తెలుగు ద్విభాషా (బైలింగ్వల్) సినిమాగా భావించారు. అయితే అది నిజం కాదని వెంకీ అట్లూరి వెల్లడించారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్‌ను పూర్తిగా తమిళంలోనే చిత్రీకరించాం. తర్వాత తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేస్తున్నాం. ఇది బైలింగ్వల్ సినిమా కాదు’ అని స్పష్టం చేశారు. దీంతో సినిమాపై నెలకొన్న సందేహాలకు తెరపడింది.

తెలుగు నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండటంతో ఈ సినిమాని ద్విభాషా సినిమాగా చాలామంది భావించారు. అయితే దర్శకుడి వ్యాఖ్యలతో ఇది తమిళ చిత్రమేనని, తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారని స్పష్టమైంది.

ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకోగా, కుటుంబ భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రెండు భాషల ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.

Related Articles