నేషనల్ క్రష్ రష్మిక మందన్న కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం. వచ్చే నెల ఆగస్టు 2న జరిగే ముగింపు కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్‌తో కలిసి భారత్ తరఫున నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలో ఆమె పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు సినీ, క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
ముగింపు వేడుకల్లో భాగంగా కామన్వెల్త్ గేమ్స్ అధికారిక పతాకాన్ని భారత్‌కు అందజేయనున్నారు. 2030లో జరిగే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించిన తర్వాత భారత్‌కు ఈ క్రీడలకు ఆతిథ్యం దక్కడం ఇది రెండోసారి కానుంది. అయితే రష్మిక పాల్గొనడంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

