ఢిల్లీలో జరిగిన ‘ఛలో పార్లమెంట్’ నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలపై ప్రముఖ నటుడు నరేష్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నీట్ పేపర్ లీక్ అంశం చాలా కీలకమైనదేనని, ఈ విషయంలో ప్రభుత్వం మరింత సమర్థంగా వ్యవహరించి ఉండాల్సిందని నరేష్ అభిప్రాయపడ్డారు. అయితే పరీక్షలు పూర్తై ఫలితాలు విడుదలైన తర్వాత హింసాత్మక ఘటనలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఘర్షణల్లో గాయపడిన పోలీసు సిబ్బందిని ప్రస్తావిస్తూ, ఈ ఘటనల వెనుక ఏవైనా కుట్రలు లేదా దేశాన్ని అస్థిరపరిచే శక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు. అలాంటి అంశాలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదే సమయంలో శాంతియుత నిరసన ప్రతి ప్రజాస్వామ్య దేశంలో పౌరుల హక్కేనని, కానీ హింసను లేదా యువతను తప్పుదోవ పట్టించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని నరేష్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని, ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరగాలని ఆయన కోరారు. నరేష్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

