హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘రాకా’కు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో తెలుగు నటి సిరి హన్మంతు కీలక పాత్రలో నటిస్తున్నట్లు నిర్మాత ఎస్కేఎన్ తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు. సిరి హన్మంతు పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. దీంతో సినిమాలో ఆమె పాత్రపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల ‘సీతాపయనంలో’ కనిపించిన సిరి, త్వరలో విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’లోనూ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ నటి ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సైన్స్ ఫిక్షన్, యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని 2027 చివర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

