బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించిన ‘గెహ్రైయాన్’ (Gehraiyaan) ఓటీటీలో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రొమాంటిక్ థ్రిల్లర్. శకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలైంది. ఆధునిక బంధాలు, ప్రేమ, మోసం, భావోద్వేగ సంఘర్షణల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తన బోల్డ్ కథనం, నటీనటుల ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందింది.
కథలో అలీషా (దీపికా పదుకొణె) ఆరేళ్లుగా కరణ్ (ధైర్య కర్వా)తో లివ్- ఇన్ రిలేషన్‌లో ఉంటుంది. ఈ సమయంలో ఆమె కజిన్ టియా (అనన్యా పాండే), టియాకు కాబోయే భర్త జైన్ (సిద్ధాంత్ చతుర్వేది) జీవితంలోకి రావడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. ఒక ట్రిప్ సందర్భంగా అలీషా, జైన్ మధ్య ఏర్పడిన ఆకర్షణ అక్రమ సంబంధానికి దారితీస్తుంది.
టియాతో బంధాన్ని ముగించి అలీషాతో కొత్త జీవితం ప్రారంభిస్తానని జైన్ మాటిచ్చినా, వ్యాపార సమస్యలు, టియా కుటుంబ ఆర్థిక అండ కారణంగా అతను వెనక్కి తగ్గుతాడు. ఇదే సమయంలో అలీషా గర్భవతి కావడం, జైన్ అసలు స్వరూపం బయటపడటం, మోసాలు, భావోద్వేగ సంఘర్షణలతో కథ ఉత్కంఠగా సాగుతుంది.
ఈ సినిమాలో దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది మధ్య వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ బోల్డ్ సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు శకున్ బాత్రా నటీనటులతో ప్రత్యేక వర్క్‌షాప్స్ నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. ప్రమోషన్ల సమయంలో దీపికా కూడా ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరణలో సహనటులకు ధైర్యం చెప్పిన విషయాన్ని వెల్లడించారు.
సినిమా విడుదల తర్వాత దీపికా పాత్ర, బోల్డ్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ ఎదురైంది. అయితే ఆమె భర్త, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ బహిరంగంగా మద్దతు తెలుపుతూ దీపికా నటనను ప్రశంసించారు.
విమర్శలు ఎదురైనా ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకోవడంలో వెనుకాడని దీపికా, ‘గెహ్రైయాన్’ ద్వారా మరోసారి తన నటనా ప్రతిభను చాటుకుంది. ఆధునిక సంబంధాల సంక్లిష్టతను భావోద్వేగాలతో చూపించిన ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి ఎంపికగా నిలిచింది.

