మోదీ స్పీచ్‌లో షారుఖ్ సినిమా

మోదీ స్పీచ్‌లో షారుఖ్ సినిమా

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జకార్తాలో జరిగిన కార్యక్రమంలో భారత్–ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడిన మోదీ, బాలీవుడ్ క్లాసిక్ సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’ టైటిల్ సాంగ్‌ను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియాలో ఈ పాటకు విశేష ఆదరణ ఉందని పేర్కొంటూ, “భారత్– ఇండోనేషియా సంబంధాలు ‘కుచ్ కుచ్’ (కొంచెం) దగ్గరే ఆగిపోకుండా ‘బహుత్ కుచ్’ (చాలా ఎక్కువ) సాధించే స్థాయికి చేరుకోవాలి” అని చమత్కరించారు. ఆయన వ్యాఖ్యలకు సభలో హర్షధ్వానాలు వినిపించాయి.

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “జకార్తాలో మన గౌరవనీయ ప్రధానమంత్రి ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాని ప్రస్తావించడం ఎంతో ఆనందంగా, గర్వంగా అనిపించింది. ప్రేమకు సరిహద్దులు లేవని మరోసారి నిరూపితమైంది. మా సినిమాను గుర్తుచేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

1998లో విడుదలైన ‘కుచ్ కుచ్ హోతా హై’లో షారుఖ్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్‌లో ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినీ అభిమానుల్లో ఇప్పటికీ ప్రత్యేక ఆదరణ పొందుతోంది. ఆ పాట ప్రజల నోటివెంట హమ్మింగ్‌గా ఇప్పటికీ పాడుకుంటా ఉంటారు. ప్రధాని మోదీ ప్రసంగం, కరణ్ జోహార్ స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.

Related Articles