టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల జాబితాలో మరో కొత్త దర్శకుడు చేరనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ సోదరుడి కుమారుడు బాబీ త్వరలో దర్శకుడిగా పరిచయం కానున్నారు. గత కొంతకాలంగా సుకుమార్ వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాబీ, ఆయనతో పాటు పలు ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకుడిగా తన తొలి సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బాబీ చెప్పిన కథ సిద్ధుకు నచ్చడంతో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, కథతో పాటు సుకుమార్ క్యాంప్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడం కూడా సిద్ధు అంగీకారానికి కారణమైందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు సుకుమార్ శిష్యుల తొలి చిత్రాలు ఎక్కువగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లోనే రూపొందిన నేపథ్యంలో, బాబీ డెబ్యూ మూవీని కూడా సుకుమారే నిర్మించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కథ, స్క్రీన్‌ప్లే, మేకింగ్ విషయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బాబీ దర్శకుడిగా ఎలా ఆకట్టుకుంటారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

