కోలీవుడ్ యువ నటుడు అథర్వ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హృదయం మురళి’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే, ఒక యువకుడి జీవితంలో ఎదురయ్యే వన్‌సైడెడ్ లవ్, ప్రేమ, జ్ఞాపకాలు, భావోద్వేగాల చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. జీవితంలో కొన్ని అనుభూతులు కాలంతో మారిపోవని సందేశాన్ని దర్శకుడు హృద్యంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ సూచిస్తోంది.
ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఎస్ దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ నటుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నటనతో పాటు ఈ సినిమాకి సంగీతాన్ని కూడా ఆయనే అందించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ పవర్‌ఫుల్ క్యామియో పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. జులై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటూ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

