అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘రాకా’ గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ముందుగా నటి ప్రీతి ముకుందన్‌ను సంప్రదించినట్లు అట్లీ వెల్లడించారు. అయితే డేట్స్ సమస్య కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం కోల్పోయిందని చెప్పారు.
తమిళ చిత్రం ‘హృదయం మురళి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న అట్లీ మాట్లాడుతూ.. “ప్రీతి నటన అంటే నాకు చాలా ఇష్టం. ‘రాకా’లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మొదట ఆమెనే ఎంపిక చేశాం. కానీ అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వలేకపోయింది. అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది” అని వివరించారు.
ప్రీతి వదులుకున్న ఆ కీలక పాత్రను మలయాళ నటి ఫెమినా జార్జ్‌కు ఇచ్చినట్లు అట్లీ స్పష్టం చేశారు. అయితే ఆమె పోషిస్తున్న పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. దీంతో సినిమాలో ఆ పాత్రపై ఆసక్తి నెలకొంది.
ఇక ప్రీతి ముకుందన్ ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై, ఇటీవల ‘బ్లాస్ట్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘హృదయం మురళి’ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

