బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కెరీర్‌లో భారీ గుర్తింపు తీసుకొచ్చిన ‘క్వీన్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘క్వీన్ 2’ విడుదలకు ముందే న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, ముంబై హైకోర్టులో రూ.250 కోట్ల దావా దాఖలవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఫాంటమ్ స్టూడియోస్ జియోస్టార్‌పై ముంబై హైకోర్టులో కేసు వేసింది. తమ అనుమతి లేకుండానే ‘క్వీన్ 2’ను రూపొందించారని, ఇది అసలు ‘క్వీన్’ సినిమాకి సంబంధించిన మేధో సంపత్తి (ఐపీ) హక్కుల ఉల్లంఘన అని సంస్థ ఆరోపిస్తోంది.
ఫాంటమ్ స్టూడియోస్ వాదన ప్రకారం, ‘క్వీన్’ చిత్ర మేధో సంపత్తి హక్కుల్లో తమకు 50 శాతం వాటా ఉంది. అందువల్ల సీక్వెల్ లేదా అనుబంధ సినిమా నిర్మించాలంటే తమ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. అయితే ‘క్వీన్ 2’ నిర్మాణానికి సంబంధించి తమను ఎవరూ సంప్రదించలేదని, ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదని కోర్టుకు తెలిపినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జియోస్టార్, దర్శకుడు వికాస్ బహల్‌తో పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం లభించలేదని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన తర్వాతే ఫాంటమ్ స్టూడియోస్ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వివాదంపై జియోస్టార్ గానీ, చిత్రబృందం గానీ అధికారికంగా స్పందించలేదు. కోర్టు తీర్పు ‘క్వీన్ 2’ విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

