‘రోమాంచకం’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

‘రోమాంచకం’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘రోమాంచకం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మేమ్ ఫేమస్’ హీరో సుమంత్ ప్రభాస్, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తుండగా, నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ వీడియో ప్రారంభంలో సముద్ర తీరంలో హీరో- హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు, బైక్ రైడ్స్‌తో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించారు. అయితే చివర్లో ఒక్కసారిగా కథలో ఊహించని మలుపు తీసుకొచ్చారు.

గ్లింప్స్ ముగింపులో హీరో, హీరోయిన్లు ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకుంటూ ‘ఐ హేట్ యూ’ అని అరిచే సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఇది సాధారణ ప్రేమకథ కాదని, బలమైన భావోద్వేగాలతో కూడిన కథగా ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా శైలికి తగ్గట్టే ప్రేమ, తీవ్ర భావోద్వేగాలు, ఉత్కంఠ మేళవింపుతో సినిమా రూపొందుతున్నట్లు గ్లింప్స్ స్పష్టం చేసింది.

విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Related Articles