‘సత్లుజ్’కు ఆర్జీవీ ఫిదా

‘సత్లుజ్’కు  ఆర్జీవీ  ఫిదా

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘సత్లుజ్’ సినిమాపై స్పందిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా రూపొందింది. తొలుత ‘పంజాబ్ 95’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) 127 కట్స్ సూచించడంతో, మేకర్స్ థియేటర్ విడుదలను విరమించుకుని ‘సత్లుజ్’ పేరుతో జులై 3న జీ5 ఓటీటీలో విడుదల చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత్‌లో ఈ సినిమాని ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించగా, ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ నేపథ్యంలో సినిమా చూసిన ఆర్జీవీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘సత్లుజ్’ కేవలం సినిమా కాదని, దేశ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసే మానని గాయమని వ్యాఖ్యానించారు. దిల్జీత్ దోసాంజ్ ఎలాంటి కమర్షియల్ హీరోయిజం చూపకుండా, తన పాత్రలో సహజంగా జీవించారని ప్రశంసించారు. అలాగే అర్జున్ రాంపాల్ పోషించిన పాత్ర సమాజంలోని భయానక వాస్తవాలను ప్రతిబింబించేలా ఉందన్నారు.

దర్శకుడు హనీ ట్రెహాన్ ఈ కథను ఎక్కడా అతిశయోక్తులకు తావివ్వకుండా, నెమ్మదిగా సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తరహాలో అద్భుతంగా తెరకెక్కించారని వర్మ కొనియాడారు. ఒక ప్రజాస్వామ్యంలో అధికార వ్యవస్థ తన పౌరులపై ఎలా వ్యవహరిస్తుందో, ఆ తర్వాత నిజాలను ఎలా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుందో ఎలాంటి ఉపన్యాసాలు లేకుండానే ఈ సినిమా ప్రభావవంతంగా చూపించిందని పేర్కొన్నారు.

అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే కళే నిజమైన విజయాన్ని సాధిస్తుందని, ప్రస్తుతం ‘సత్లుజ్’ ఎదుర్కొంటున్న పరిస్థితులే దానికి నిదర్శనమని ఆర్జీవీ అన్నారు. నేటి ప్రధాన స్రవంతి సినిమాలు వినోదానికే పరిమితమవుతున్న సమయంలో, నిజాయితీతో తీసిన సినిమా ఎంతటి ప్రభావాన్ని చూపగలదో ‘సత్లుజ్’ నిరూపించిందన్నారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలని, దానిపై చర్చ జరగాలని కోరుతూ, జస్వంత్ సింగ్ ఖల్రాకు జరిగిన అన్యాయం మాదిరిగా ఈ సినిమాకు కూడా ‘ఎన్‌కౌంటర్’ ముగింపు ఇవ్వొద్దని అధికారులను విజ్ఞప్తి చేశారు. చివరగా, సత్యాన్ని ఎంత దాచాలని ప్రయత్నించినా అది మరింత బలంగా బయటపడుతుందన్నారు.

Related Articles