టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ మరో వీడియో విడుదల చేస్తూ ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని ఆరోపించారు. తన ఆడియోను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గాలి మాటలు సృష్టించి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. “ఈ ఆడియో మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సోషల్ మీడియాలో దీన్ని ఎవరు లీక్ చేశారు? మీరు చేస్తున్న నాటకం ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా ఎంతకు దిగజారుతారు.. కొత్తగా ఏదైనా ట్రై చేయండి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పదవి ఉందన్న అహంకారంతో ఒక వ్యక్తిని వరుసగా అరెస్టు చేయించడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇదిలా ఉండగా, యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ పొందిన రావణ్‌పై, గన్నవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొత్త కేసు నమోదు చేసి మళ్లీ అరెస్టు చేశారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.

