దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 61వ చిత్రం ‘సింగ్ గీతం’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా జులై 9, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని నిర్మాత నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించారు.
థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా, ఓటీటీలో తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. అలాగే డిజిటల్ వెర్షన్‌లో ఆడియో, విజువల్స్‌తో పాటు కొన్ని సన్నివేశాల్లో స్వల్ప మార్పులు చేసి, మరింత మెరుగైన వీక్షణ అనుభూతి అందించేలా రూపొందించినట్లు నాగ్ అశ్విన్ తెలిపారు.
ఫాంటసీ, సంగీతం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ‘సింగ్ గీతం’లో ఓ గ్రామంలోని ప్రజలు తమ భావాలను పాటల రూపంలో వ్యక్తపరిచే వినూత్న కథాంశాన్ని చూపించారు. ఈ సినిమాలో అయాన్, అహిల్యా బమ్రూ ప్రధాన పాత్రలు పోషించగా, నివేదా పేతురాజ్, శివన్నారాయణ, బెనర్జీ, తులసి శివమణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాకు మరో ఆకర్షణగా నిలవనుంది.

