యాడ్స్ రూల్స్‌తో అమెజాన్ చిక్కుల్లో

యాడ్స్ రూల్స్‌తో అమెజాన్ చిక్కుల్లో

ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఆస్ట్రేలియాలో చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. స్ట్రీమింగ్ మధ్యలో ప్రకటనలు ప్రవేశపెట్టి, వాటిని తొలగించాలంటే వినియోగదారుల నుంచి అదనపు రుసుము వసూలు చేయడంపై ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ACCC) ఫెడరల్ కోర్టులో అమెజాన్‌పై దావా వేసింది.

వార్షిక ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ నిబంధనల్లో ఏకపక్ష మార్పులు చేసి, వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సేవల స్వరూపాన్ని మార్చిందని కమిషన్ ఆరోపించింది. ఈ నిర్ణయం వల్ల 2023 నవంబర్ నుంచి 2025 ఆగస్టు వరకు ఆస్ట్రేలియాలో సుమారు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ప్రభావితమైనట్లు తెలిపింది.

2024 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రకటనలు ప్రారంభించిన అమెజాన్, ఇప్పటికే వార్షిక చందా చెల్లించిన సుమారు 8.5 లక్షల మంది వినియోగదారులు కూడా ప్రకటనలతో కూడిన కంటెంట్ చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని పేర్కొంది. ప్రకటనలు లేకుండా వీక్షించాలంటే అదనపు రుసుము చెల్లించాలని నిబంధన విధించడం వినియోగదారుల హక్కులకు విరుద్ధమని ACCC కోర్టుకు వివరించింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కాగా, కేసును నిశితంగా పరిశీలిస్తూ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని అమెజాన్ ఆస్ట్రేలియా ప్రతినిధి తెలిపారు.

Related Articles