బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఇటీవల మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ మహిళా అభిమాని, “నా భర్త కంటే మీరంటేనే నాకు ఎక్కువ ఇష్టం” అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. దీనికి షారుక్ సరదాగా స్పందిస్తూ, “ఇలాంటి విషయాలు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి కదా” అని అన్నారు. అనంతరం ఆమె మాటల వెనుక ఉన్న అభిమానాన్ని అర్థం చేసుకున్నానని, ఆమె భర్త, కుటుంబంపై కూడా తనకు గౌరవం, ప్రేమ ఉన్నాయని చెప్పి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో షారుక్ తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు. బాల్యంలో తీసిన ఓ అరుదైన ఫొటోను చూపిస్తూ, తొలి ఐదేళ్లు మంగళూరులోనే గడిచాయని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ ‘కింగ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా ఆయన కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కానుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సి, జైదీప్ అహ్లావత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

