కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నటి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘హైకూ’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తైంది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఏగన్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల పాటు సాగిన షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, కథను నమ్మి పూర్తి సృజనాత్మక స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగ చిత్రంగా ‘హైకూ’ను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో అదిర్చి అరుణ్, మైమ్ గోపి, ఇందుమతి, జెన్సన్, ఇస్మత్ బాను, డాక్టర్ శివ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, సినిమా విడుదలకు ముందే పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషంగా మారింది. మేకింగ్ దశలోనే ఓటీటీ ఒప్పందం కుదరడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని చిత్రబృందం పేర్కొంది. త్వరలో మరిన్ని అప్డేట్స్ వెల్లడించనున్నారు.

