అమరావతిలో ‘NBK 112’ ప్రారంభం

అమరావతిలో ‘NBK 112’ ప్రారంభం

నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘NBK 112’ చిత్రం నేడు అమరావతిలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టగా, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, నిర్మాత సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి సినిమా ప్రారంభోత్సవం ఇదేనని పేర్కొన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఏపీలో ఎన్నో అద్భుతమైన చిత్రీకరణ ప్రదేశాలు ఉన్నాయని, ఎన్టీఆర్, ఏఎన్నార్ పుట్టిన నేలపై సినీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని అన్నారు.

నారా లోకేశ్ మాట్లాడుతూ, తాను తొలిసారి ఓ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యానని, ముద్దుల మామయ్య బాలయ్య సినిమాకు క్లాప్ కొట్టడం ఆనందంగా ఉందన్నారు. బాలకృష్ణ నేతృత్వంలో ఏపీలో సినీ పరిశ్రమను బలోపేతం చేస్తామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు ఏర్పాటు చేసి, విజయవాడకు చిత్రపరిశ్రమ పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడించారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.

Related Articles