ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ, స్వేచ్ఛ, సమాజ బాధ్యతలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో జరుగుతున్న విషయాలనే సినిమాల్లో చూపిస్తున్నామని చెప్పడం సరైన వాదన కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కమర్షియల్ సినిమా అయినా, ఇతర చిత్రాలు అయినా సమాజం పట్ల కొంత బాధ్యత ఉండాలని పేర్కొన్నారు.
ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న “మై బాడీ, మై రైట్” అనే అంశంపై కూడా సునీత స్పందించారు. అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉన్నట్లే, చూసే వ్యక్తి చూపు కూడా అతని ఇష్టమనే వాస్తవాన్ని గుర్తించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో ఎవరినీ పూర్తిగా తప్పుపట్టలేమని పేర్కొన్నారు.
అయితే బట్టల పొడవు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడాన్ని నిజమైన స్వేచ్ఛగా తాను భావించనని సునీత అన్నారు. మహిళల భద్రత, అభిప్రాయాలకు సమాజంలో లభించే గౌరవమే అసలైన సమానత్వానికి ప్రమాణమని అభిప్రాయపడ్డారు. సిగరెట్లు తాగడం లేదా కొన్ని అలవాట్లను అనుసరించడం ఈక్వాలిటీ కాదని, మహిళల అభిప్రాయాలకు విలువ దక్కేలా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే “ఎస్” లేదా “నో” చెప్పే హక్కు ప్రతి మహిళకు ఉండాలని, ఎవరికీ బలవంతం చేసే హక్కు లేదని సునీత స్పష్టం చేశారు.

