మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించే కొత్త సినిమా ఖరారైంది. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘లార్డ్ మార్కో’ అయి ఉండచ్చు. ‘మార్కో’, ‘కట్టలాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించిన క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత షరీఫ్ మహ్మద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మమ్ముట్టి పాత్ర ఎలా ఉండబోతోందో తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేశారు. మునుపెన్నడూ పోషించని ఓ విభిన్నమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నట్లు షరీఫ్ తెలిపారు. దర్శకుడు, ఇతర తారాగణం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
అయితే ఈ సినిమా పేరు ‘లార్డ్ మార్కో’ అయి ఉంటుందని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘మార్కో’ డైరెక్టర్ హనీఫ్ అదేని, క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో కలిసి నెల రోజుల క్రితం కేరళ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘లార్డ్ మార్కో’ టైటిల్‌ని రిజిస్ట్రేషన్ చేయించడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. కాగా, మమ్ముట్టి నటించి, నిర్మించిన ‘కలమ్ కావల్’ సినిమా నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

