నటన అంటే తనకు చాలా ఇష్టమని, కానీ అదే తన జీవిత లక్ష్యం కాదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. “నేను డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే మనిషిలా కనిపిస్తానేమో. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తాను కానీ, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వను. ఒకవేళ నటననే కెరీర్‌గా కొనసాగించి ఉంటే ఇప్పటికి మంచిపేరు సంపాదించేదాన్ని” అని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తనకు మంచి పాత్రలు, మహిళా ప్రాధాన్యం ఉన్న కథలు వస్తున్నాయని రేణూ తెలిపారు. త్వరలోనే ఓ కామెడీ సినిమాలో అత్త పాత్రలో నటించనున్నట్లు వెల్లడించారు. అత్తాకోడళ్ల మధ్య హాస్యభరితంగా సాగే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. తనకు ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఎక్కువని, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని ఆమె పేర్కొన్నారు.
