ఓ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆమెకు అక్కడి అధికారులు షాకిచ్చారు. మల్లెపూలు తీసుకెళ్లినందుకు భారీ ఫైన్ వేశారు. మలయాళీలకు ఓనం పండగ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కేరళకు చెందిన ఓ నటికి ఆస్ట్రేలియాలో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనం వేడుకలను నిర్వహించింది. కేరళకు చెందిన నటి నవ్య నాయర్ ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. ఆ సమయంలో ఆమె బ్యాగ్ లో మల్లెపూలు ఉన్నాయి. దీంతో మెల్ బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఆమెను అధికారులు తనిఖీలు చేశారు. మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.లక్షా పధ్నాలుగు వేలు ఫైన్ వేశారు. ఈ విషయాన్ని నటి అక్కడ జరిగిన బహిరంగ కార్యక్రమంలో వెల్లడించారు.
ఆస్ట్రేలియా వచ్చే ముందు తన కోసం తన తండ్రి మల్లెపూలు కొని తెచ్చినట్లు తెలిపారు. అయితే, అందులో కొన్నింటిని తలలో పెట్టుకోగా.. మరికొన్నింటిని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నట్లు వివరించారు. తాను చేసింది చట్ట విరుద్ధమే అయినా.. తెలియక చేసినట్లు పేర్కొన్నారు. పొరపాటున జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చారు.
