మదరాసి’ సినిమా విడుదల సందర్బంగా దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ కొత్త వివాదానికి తెర లేపారు. ‘మదరాసి’ అనే పేరు వెనుక దక్షిణాది రాష్ట్రాల మ్యాప్‌ను పెట్టడాన్ని కొందరు ఆక్షేపిస్తున్నారు. తమని ‘మదరాసి’గా ఇంకా గుర్తించాలని తాము అనుకోవడం లేదని చెబుతున్నారు. కొన్నేళ్ళ పాటు తెలుగు వారిని మదరాసీలుగానే ఉత్తరాది వాళ్ళు గుర్తించే వాళ్ళు. మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పుణ్యమా అని తెలుగుజాతికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదం ఎన్టీఆర్‌ను ఏకంగా అధికార పీఠంపై కూర్చోపెట్టింది. దక్షిణాది వారిని గంపగుత్తగా ‘మదరాసి’ అనేయడం సరైంది కాదని ఎన్టీఆర్ వంటివారు అనేకసార్లు చెప్పారు. ఇప్పుడాపదాన్ని తిరిగి దక్షిణాది వారందరికీ కట్టబెట్టే ప్రయత్నాన్ని తమిళ దర్శకుడు ఎ. ఆర్. మురుగదాస్ చేయడాన్ని కొందరు తెలుగువాళ్ళు ఆక్షేపిస్తున్నారు.
ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన ఎ. ఆర్. మురుగదాస్ సినిమా ‘మదరాసి’ సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. దాని చివరిలో ‘మదరాసి’ అనే టైటిల్ వెనుక సౌతిండియా మ్యాప్‌ని వేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.
