తెలుగు సినీ నటుడు రాజీవ్ కనకాల భూ లావాదేవీ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు, అదే కేసులో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ, పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.421 వెంచర్‌లో రాజీవ్ కనకాలకు ఓ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌ను ఆయన కొన్ని నెలల క్రితం విజయ్ చౌదరికి విక్రయించారు. అధికారిక రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని సమాచారం. అయితే, విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను ఎల్బీనగర్‌కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి రూ.70 లక్షలకు విక్రయించారు. దాంతో లావాదేవీ ముగిసినట్లయింది. కానీ తర్వాత అసలు సమస్య మొదలైంది. శ్రవణ్ రెడ్డి తన ఫ్లాట్‌ను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు, సదరు ప్లాట్ ఎక్కడా కనిపించకపోవడం, ఆ స్థలంలో ఆనవాళ్లు లేకపోవడం గమనించారు. తనను నకిలీ స్థలంతో మోసగించారన్న అనుమానంతో, విజయ్ చౌదరిని సంప్రదించగా, మళ్లీ అమ్మనని, దీనిపై వివాదం నడుస్తోందని, ఏదైన ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి తప్పించుకున్నాడట. గట్టిగా అడిగితే అంతు చూస్తానని బెదిరించాడంటూ శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హయత్‌నగర్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా, ముందుగా స్థలాన్ని విక్రయించిన రాజీవ్ కనకాల పాత్రను పరిశీలించేందుకు ఆయనకు నోటీసులు పంపించారు. ఈ ఫ్లాట్ లావాదేవీలో రాజీవ్ పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక డాక్యుమెంట్లు, మ్యూటేషన్ రికార్డులు, స్థల పరిమితి వివరాలపై విచారణ కొనసాగుతోంది. ఈ వివాదం సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. రాజీవ్ కనకాల ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారు, విచారణలో ఏం వెలుగులోకి వస్తాయో అనే విషయాలపై అందరి దృష్టి ఉంది.

- July 24, 2025
0
77
Less than a minute
Tags:
You can share this post!
editor