మైసూరు శాండల్ సబ్బులు, శ్రీ గంధం ఉత్పత్తులకు నటి తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కర్ణాటకలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తమన్నాకు కన్నడ భాష తెలియదని, కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన లేని వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం సరికాదని ప్రజలు, ప్రజాప్రతినిధులు, కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మైసూరు పార్లమెంట్ సభ్యుడు కృష్ణదత్త ఒడయార్ ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పూర్వీకుడు కృష్ణరాజు ఒడయార్ 1916లో స్థాపించిన చారిత్రక మైసూరు కంపెనీకి పరభాష నటులను అంబాసిడర్‌గా నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది రాష్ట్ర గుర్తింపును, సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవ పరచడమేనని ఆయన ఆరోపించారు. మరోవైపు తమన్నాకు బ్రాండ్ అంబాసిడర్‌గా రూ. 6.2 కోట్లు చెల్లించడం పైనా కర్ణాటక ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎందరో సమర్థులైన కన్నడ నటీనటులు ఉండగా, వేరే భాష నటిని ఎందుకు ఎంపిక చేశారని సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.