పాకిస్థాన్ న‌టుడితో ఉన్న పోస్ట్‌ను తొలగించిన బాలీవుడ్‌ న‌టి

పాకిస్థాన్ న‌టుడితో ఉన్న పోస్ట్‌ను తొలగించిన బాలీవుడ్‌ న‌టి

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ న‌ర‌మేధంలో 28 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యాటకులపై మంగళవారం మధ్యాహ్నం ఉగ్ర‌వాదులు దాడి జ‌రుప‌గా.. ఈ దాడితో కశ్మీర్‌ లోయతోపాటు దేశం మొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదిలావుంటే ఈ ఘ‌ట‌న అనంత‌రం పాకిస్థాన్‌కి చెందిన న‌టుల‌పై మ‌ళ్లీ వ్య‌తిరేక‌త మొద‌లైంది. పుల్వామా దాడి ఘ‌ట‌న అనంత‌రం పాకిస్థాన్‌కి చెందిన న‌టులు ఇండియ‌న్ సినిమాల‌లో న‌టించ‌డం మానేసిన విష‌యం తెలిసిందే. అయితే చాలారోజుల త‌ర్వాత పాకిస్థాన్‌కి చెందిన న‌టుడు ఫవాద్‌ ఖాన్ మ‌ళ్లీ ఒక బాలీవుడ్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. బాలీవుడ్ న‌టి వాణీకపూర్‌, పాకిస్థాన్ స్టార్‌ ఫవాద్‌ ఖాన్ జంట‌గా న‌టిస్తున్న తాజా సినిమా ‘అబీర్‌ గులాల్‌’. ఆర్తి ఎస్. బాగ్డి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది చిత్ర‌యూనిట్. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. వాణీక‌పూర్ ఫవాద్‌ ఖాన్‌తో ఉన్న‌ ‘అబీర్‌ గులాల్‌’ పోస్టర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాను పోస్ట్ చేసిన రోజే ఉగ్రదాడి జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌పై స్పందించ‌కుండా పాకిస్థాన్ న‌టుడితో సినిమాను చేయ‌డ‌మే కాకుండా ప్ర‌మోషన్స్ చేస్తోందంటూ వాణీ క‌పూర్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే ఈ వివాదం ఇంకా ముదురుతుండ‌డంతో తాజాగా ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది వాణీ. మ‌రోవైపు ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌పై పాకిస్థాన్ న‌టుడు ఫవాద్‌ ఖాన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ.. దాడిని ఖండించాడు. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

editor

Related Articles