Movie Muzz

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు..!

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు..!

హైదరాబాద్ :  సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ  ‘దండోరా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు గానూ హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు శివాజీ. తాను మాట్లాడిన మాటలు మహిళలు అందరి గురించి కాదని స్పష్టం చేశారు. సినిమా హీరోయిన్స్ బయటకు వెళ్లినప్పుడు నిండుగా బట్టలు ధరించి వెళ్లాలని సూచించానని అన్నారు. అలా వెళ్తే తమకు ఇబ్బంది ఉండదేమోననే కోణంలోనే మాట్లాడాను తప్ప వేరే ఎవరినీ అవమానపరచాలనీ తాను మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన సందర్భంలో రెండు అన్ పార్లమెంటరీ వర్డ్స్ వచ్చాయని… వాటికి సీన్సియర్‌గా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు శివాజీ. సమాజంలో స్త్రీలను తక్కువ స్థాయిలో చూస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వవద్దనే తాను ఇలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. తన మాటలతో మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప.. తనకు ఎవరినీ అవమానపరచాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమలోని ఆడవారి మనోభావాలు దెబ్బతిన్నందుకు గానూ.. మహిళలు ఎవరైనా ఈ విషయాన్ని తప్పుగా అనుకుంటే అందరికీ తన హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నానని నటుడు శివాజీ పేర్కొన్నారు.

editor

Related Articles