కథా బలమున్న సినిమాలతో ఇటు వెండితెర పైనా.. అటు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని అలరిస్తూ సత్తా చాటుతోంది ఈటీవీ విన్. అలా ఇటీవలే లిడిల్ హార్ట్స్‌తో భారీ థియేట్రికల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సంస్థ నుండి బాక్సాఫీస్ బరిలోకి రాజు వెడ్స్ రాంబాయి అనే మరో ప్రేమకథ వచ్చింది. మరి ప్రేమకథ నవ్వించిందా? మనసుల్ని బరువెక్కించిందా?
ఇక కథలోకి వెళితే.. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వరంగల్ – ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరు. ఆ ఊళ్లో రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొట్టడంలో తనకు తానే సాటి. పెళ్లి వేడుకైనా.. చావు కార్యక్రమమైనా రాజు బ్యాండ్ గట్టిగా సౌండ్ చెయ్యాల్సిందే. తను ఆ ఊరికే చెందిన రాంబాయి (తేజస్విని రావ్) ని చిన్నప్పట్నుంచి ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. మొదట్లో అతని ప్రేమను రాంబాయి వ్యతిరేకించినా… తర్వాత తన ప్రేమలోని నిజాయితీ, బ్యాండ్ కొట్టే స్టైల్‌ని చూసి అంగీకరిస్తుంది. అయితే ఆమె తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ).. కూతురికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుర్రాడినే ఇచ్చి పెళ్లి చేయాలన్న లక్ష్యంతో జీవిస్తుంటాడు.

