పవన్ కళ్యాణ్ ఒకప్పుడు “ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను” అని ప్రకటించగా, ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించడానికీ ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు ఆయనే నటుడు ప్రకాష్ రాజ్. పవన్ గతంలో కమ్యూనిస్టు భావజాలాన్ని పట్టుకుని, చేగువేరాను ఆదర్శంగా కొనియాడితే… ఇప్పుడు సనాతన ధర్మం విలువలు చెబుతూ ఎన్‌డిఎ కూటమిలో కీలక భాగస్వామిగా మారారు. ఈ మార్పుపై ప్రకాష్ రాజ్ ఎన్నోసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2018లో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీపై సంధించిన ఆగ్రహ ప్రసంగాన్ని తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. దీనిపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ.. “ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఆ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే… కేంద్రం ఏపీని దగా చేసింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ హామీని నెరవేర్చలేదు, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారు, మా హక్కుల కోసం పోరాటం చేస్తాం అని అన్నారు. “అమరావతి నుండే ఉద్యమం ప్రారంభించాలి” అనే పిలుపునిచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రిగా అదే ఎన్‌డిఎ కూటమిలో భాగమై ఉన్నారు. గతంలో ఆ పార్టీని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారితో కలిసి ఉండడంపై నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. “అప్పుడు ప్రశ్నించినవే ఇప్పుడు సమాధానమయ్యాయా?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ షేర్ చేసిన పోస్ట్‌తో పాటు పవన్ కళ్యాణ్ పాత వీడియోలు, ప్రసంగాలు షేర్ చేస్తూ “సిద్ధాంతాల మార్పు ఎప్పుడైంది?” అనే ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

- July 14, 2025
0
40
Less than a minute
Tags:
You can share this post!
editor